
దయ్యాలు ఉంటాయా ఉండవా అనే విషయాన్ని పక్కకు పెడితే వినోద పరంగా ఈ సినిమాకి మంచి మార్కులే ఇవ్వచ్చు. ఎవ్వరు కూడా సినిమాకి వెళ్లి చూడడం ద్వారా దయ్యాలు ఉంటాయి, ఉండవని నిర్నయించుకోరు. అంటే, దయ్యాలు ఉంటాయని నమ్మని వారు ఈ సినిమా చుసిన తర్వాత ఉంటాయని నమ్మే అవకాశం లేదు. అలాగే నమ్మేవారు కొత్తగా ఎక్కువ నమ్మేదేమీ ఉండదు. అయితే ఒకవేళ దయ్యాలు ఉంటే ఎలా వుంటుందన్న దానిమీద ఈ సినిమా ఎంత బాగా ఫోకస్ చేసిందన్న విషయం మాత్రమె చూడాలి.
ఎనభై సంవత్సరాల క్రితం గద్వాల రాణి ఒక మనిషిని (అంటే మాంత్రికుడిని) సజీవ సమాధి చేసి, అతని ప్రేతాత్మ కూడా బయటికి రాకుండా దిగ్బంధనం చేయిస్తుంది. అయిన కూడా ఆ సమాధి లోనుంచే అతని ప్రేతాత్మ తన ప్రభావం చూపకుండా ఆపలేక పోతుంది (విచిత్రం). చివరికి అతని ప్రేతాత్మని కూడా నాశనం చేయాలని నిశ్చయం చేసుకుని, పరిశోధిస్తుంది. (ప్రేతాత్మలు ఎలా నాశనమవుతాయో తెలియదు! అసలు నాశనం లేనిదే కదా ఆత్మ! బహుశా ఆత్మ, ప్రేతాత్మలుగా పునర్విభజన చేశారేమో). చివరికి రహస్యం తెలుసుకుంటుంది. తాను మరణించి పునర్జన్మించి ఆ ప్రేతాత్మని ఆకర్షించి అది ఒక మనిషిని ఆవహించి తన దగ్గరికి వచ్చినప్పుడు (ఎందుకంటే ప్రేతాత్మలకు దేహం ఉండదు కాబట్టి) తన పూర్వపు దేహంలోని ఎముకలతో తయారు చేసిన ఆయుధం (వజ్రాయుధం లాంటిది) తో, అది కూడా తన (ప్రస్తుత) రక్తంలో ముంచి సంహరించినపుడు మాత్రమే అతనికి మరణం ఉంటుందని తెలుసుకుంటుంది. తదుపరి కథ అంతా దాని ఆచరణ మాత్రమే.
ముందే అనుకున్నట్టుగా దయ్యాల ఉనికి విషయంపై నేను చర్చించ దలుచుకో లేదు. పశుపతిగా, ప్రేతాత్మగా సొనుసూద్, జేజమ్మగా, అరుంధతిగా అనుష్క అద్భుతంగా నటించారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ అపూర్వం (టాలీవుడ్లో). కథా పరంగా మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. వేరేమనిషిని ఆవహించిన ఆత్మ మనిషి రూపాన్ని ఎలా మారుస్తుంది? బహుశ సోనూసూద్ ని మళ్లీ చూపడానికి అయుంటుంది.
భీభత్స రసాన్ని సినిమా అంతటా బాగా రక్తి కట్టించారు. షియాజీ షిండే, మనోరమ, ఇతరుల నటన కూడా ఆకట్టుకునేలా వుంది. సోనూ సూద్ పాత్రకు డబ్బింగ్ చెప్పిన జయశంకర్ బాగా ఆకట్టుకున్నాడు. కోటి సంగీతం వల్ల మరింత హారర్ ఎఫెక్ట్ వచ్చింది. ఈ సినిమాకి వచ్చే వారంతా ఈరకమైన థ్రిల్ కోసమే వస్తారు కాబట్టి బాగానే ఎంజాయ్ చేస్తారు.
No comments:
Post a Comment